Wednesday, 18 July 2012

పేదరికం ఉన్నా... పోటీలో గెలవడం నేర్చుకున్నా- అరుణశ్రీ, గ్రూప్-1 విజేత


పేదరికంలో ఉన్న కుటుంబానికి ఆలంబనగా నిలవాలనే ఆలోచన.. తొలి విజయానికి పునాది వేస్తే.. ఆ విజయం స్ఫూర్తిగా మరో విజయం.. అదే ఉత్సాహంతో మరో విజయంతో అత్యున్నత స్థాయి ఆర్డీఓ పోస్టు సొంతమవడం.. ఇదీ అరుణశ్రీ సక్సెస్ స్టోరీ. పేదరికంపై పోరాడి పేరుకు తగినట్లుగానే డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-1 వరుస విజయాలతో ప్రకాశించి.. ప్రస్తుతం ఆర్డీఓగా వరంగల్‌లో శిక్షణ పొందుతున్న కరీంనగర్ జిల్లాకు చెందిన అరుణశ్రీ ఏమంటున్నారంటే..
ఆలంబనగా నిలవాలన్నదే ఆలోచన:
కుటుంబమంతటికీ నాన్న వస్త్ర వ్యాపారమే ఆదాయం. అది కూడా అరకొర సంపాదనే. దీంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని భావించా. దీనికి మొదటి మార్గం బాగా చదివి దాని ఆధారంగా చక్కటి ఉద్యోగం. ఈ ఆశయానికి ఇంట్లో వారి ప్రోత్సాహం ఉత్సాహాన్ని నింపింది.
ముందు టీచర్.. తర్వాత ఏసీటీఓ:
2008లో డీఎస్సీలో విజయం సాధించి టీచర్‌గా తొలి ఉద్యోగం పొందాను. అప్పటికి కొంత ఊరట కలిగినా.. ‘ఇంతేనా జీవితం.. ఉన్నత స్థానాలకు చేరుకోవడం పేదరికంతో సాధ్యం కాదా’ అనే అంతర్మథనం నాలో మొదలైంది. అప్పుడే వచ్చిన గ్రూప్-2కు రేయింబవళ్లు శ్రమించి విజయం సాధించి ఏసీటీవోగా ఎంపికయ్యాను. అప్పుడే అనిపించింది.. జీవితంలో ఎదగడానికి పేదరికం ఏ మాత్రం అడ్డుకాదని.. అది ఓ సాధనమని!
గ్రూప్-1పై దృష్టి:ప్రయత్నించిన రెండు పరీక్షల్లో సత్ఫలితమే. ఏసీటీఓ మంచి ఉద్యోగమే. కానీ కెరీర్ ఉన్నతి పరిమితం. ‘బాగా కష్టపడితే సీటీఓ స్థాయికి చేరతాం. అంతే కదా’ అనే ఆలోచన తలెత్తింది. ఆ ఆలోచనతో గ్రూప్-1పై దృష్టి సారించా. అదేసమయంలో ఖరీదైన కోచింగ్, నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవడం? ఇవన్నీ చేస్తేనే గ్రూప్-1 కొట్టడం సాధ్యం.. అనే మాటలు కొంత భయపెట్టినా గత విజయాలే స్ఫూర్తిగా కదిలాను. ధైర్యంగా దరఖాస్తు చేసి..ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ప్రిపరేషన్ ప్రారంభించాను.
ప్రిలిమ్స్‌లో పాసయ్యాను:
దరఖాస్తు సమయంలో ధైర్యంగా ఉన్నప్పటికీ సక్సెస్ కాగలనా? అనే సందేహం. పరీక్షకు లభించిన సమయం కూడా కొంచెమే. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా ఉన్న కొద్ది సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలని భావించాను. అంతకుముందు గ్రూప్-2 ప్రిపరేషన్, మెటీరియల్ కొంత ఉపకరించింది. ప్రిలిమ్స్‌కు నెల ముందు ప్రిపరేషన్ మొదలుపెట్టి ప్రీవియస్ పేపర్లు బాగా పరిశీలించాను. ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నా. 6 నుంచి 10వ తరగతివరకు టెక్ట్స్‌బుక్స్‌ను బాగా ఔపోసన పట్టాను. దీంతో పరీక్ష బాగా రాసి ప్రిలిమ్స్ పాసయ్యాను.
మెయిన్స్‌కు చాలా కష్టపడ్డాను:
కోచింగ్ తీసుకోవాలా? వద్దా? మెయిన్స్ విషయంలో తర్జనభర్జన. చివరికి ప్రతి సబ్జెక్ట్‌కు ఇద్దరు ఫ్యాకల్టీల నోట్స్ సేకరించి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేశాను. సాక్షి విద్య, భవిత బాగా ఫాలో అయ్యాను. మెయిన్స్‌లో కీలకమైన రైటింగ్ కోసం కూడా ప్రాక్టీస్ చేశాను. రోజుకు సుమారు ఎనిమిది గంటలు చదివాను. మెయిన్స్ ‘తెలుగుమీడియంలో రాయగలనా?’ అనే భయం పోయింది. 494 మార్కులతో ఇంటర్వ్యూకి ఎంపికయ్యా.
ఇంటర్వ్యూలోనూ ఇబ్బందే:
ఇరవై నిమిషాలు సాగిన ఇంటర్వ్యూలో అప్పటికే నేను ఏసీటీఓగా పనిచేస్తున్న వాణిజ్య శాఖ సంబంధిత ప్రశ్నలే ఎక్కువగా అడిగారు. ఇది ఊహించక ఇబ్బంది పడ్డాను. వాణిజ్య పన్నుల శాఖలో వివిధ అధికారుల స్థాయిల గురించి చెప్పండి? వాణిజ్య దుకాణాలకు లెసైన్సులు ఎలా జారీ చేస్తారు? వస్త్ర దుకాణాల నుంచి వసూలు చేస్తున్న వ్యాట్, వ్యాపారుల ఆందోళనల గురించి తెలిసింది చెప్పండి? మీ శాఖలో అవినీతి గురించి వివరించగలరా? ఓట్ ఆన్ అకౌంట్ అంటే? రాష్ట్ర బడ్జెట్‌లో వాణిజ్యపన్నుల శాఖ వాటా? గ్రూప్-1 రాకపోతే ఏంచేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పలేకపోయాను.
ఆర్డీఓగా ఎంపికయ్యాను:
చివరకు ఫలితాల్లో.. 541 మార్కులతో బీసీ-డీ కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యానని తెలిశాక
జీవితంలో ఎన్నడూ లేనంత ఆనందం పొందాను. ప్రస్తుతం
వరంగల్‌లో శిక్షణ పొందుతున్నాను. జీవితంలో ఖాళీగా ఉండటం అనే పదానికి చోటు లేకుండా.. ఉద్యోగ పరిధిలో పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం.
పేదరికంపై ప్రతిభతో ‘‘దండెత్తాడు’’
అంగూరు శివాజీ, సివిల్స్ విజేత

‘ఇంట్లో ఆర్థికపరిస్థితులు బాగోలేని అభ్యర్థి పోటీపరీక్షలపై మనసు పెట్టడం కష్టం. కోచింగ్, ఇతర అవసరాలకు డబ్బులు ఎలా? అని ఆలోచించే దుస్థితి ఎదురు కాకూడదు’. ఆ బాధలన్నిటినీ అధిగమించి.. కుటుంబం కోసం తప్పనిసరిగా చిన్నా చితకా ఉద్యోగం చేస్తూనే.. జీవిత లక్ష్యమైన సివిల్స్ సాధించిన ఘనత అంగూరు శివాజీ సొంతం. పేద రైతు కుటుంబంలో పుట్టి.. దేశంలోనే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 656వ ర్యాంకు సాధించిన శివాజీ విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
పేరుకే రైతు.. ఇంట్లో అన్నీ కష్టాలే
శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలోని లోహరిజోల గ్రామంలో రైతు కుటుంబం మాది. రాజాంలో బీఎస్సీ; తర్వాత హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎంబీఏ మార్కెటింగ్ పూర్తిచేశా. అప్పటికే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నా.. వ్యవసాయంలో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత. కొన్నాళ్లు ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేశా. ఆర్థిక ఇబ్బందులున్నా.. అమ్మానాన్న సివిల్స్ లక్ష్యాన్ని కొనసాగించమని ప్రోత్సహించారు.
అదే ధైర్యం.. సివిల్స్ వైపు పయనం:
ఎంత కష్టపడైనా సివిల్స్ సాధించాలని నిశ్చయించుకున్నాను. సివిల్స్ అసాధ్యం కాదు అని అనుక్షణం నాకు నేనే ప్రోత్సహించుకున్నాను. ఎంబీఏతో వచ్చిన ఉద్యోగాలు జీవనాధారం చూపినా సమాజానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కలగలేదు. దీంతో సివిల్స్‌తోనే అవి సాధ్యమని భావించాను. మొదటి ప్రయత్నం (2010)లో విఫలమైనా వెరవలేదు.
రెండో ప్రయత్నంలో విజయం:రెండో అటెంప్ట్ (2011) కోసం కోచింగ్ తీసుకున్నా. సివిల్స్‌లో ప్రశ్నలను లోతుగా అడుగుతుండడంతో ప్రామాణిక పుస్తకాలను ఫాలో అయ్యాను. ఎక్కువగా బేసిక్స్ నుంచే వస్తుండడంతో ముందు బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌పై దృష్టి సారించాను. అనుక్షణం ఇంట్లో ఆర్థికపరిస్థితి గుర్తు చేసుకుని పట్టుదలగా చదవడం మొదలుపెట్టా. రెండో ప్రయత్నంలో సివిల్స్ రాకుంటే.. ఇక ఆ ప్రయత్నం విరమించి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం బోధన
రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాను. అదృష్టవశాత్తూ రోజుకు 8 గంటలకుపైగా ప్రిపరేషన్‌తో ప్రిలిమ్స్‌లో నెగ్గాను.
ప్రిలిమ్స్ విజయం.. రెట్టింపైన ధైర్యం. ప్రిలిమ్స్‌లో సాధించిన విజయం ధైర్యాన్ని, భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచింది. మెయిన్స్‌లో ఎలాగైనా విజయం సాధించాలన్న కసిని పెంచింది. ఆప్షనల్స్ ఎంపిక నుంచి ప్రిపరేషన్ వరకు చాలా జాగ్రత్తగా అడుగులు వేశా. హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకుని మంచి మెటీరియల్ సేకరించుకున్నాను. ఎన్‌సీఈఆర్‌టీ టెక్ట్స్‌బుక్స్, ఆంగ్ల పత్రికలు, మేగజైన్లు, ఎకనామిక్ అండ్ పొలిటికల్ మేగజైన్లు, హిస్టరీ సబ్జెక్టుకు ఆర్‌ఎస్ శర్మ, సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర, నార్మన్‌లోమ్ పుస్తకాలు చదివాను. మొత్తం ప్రిపరేషన్‌లో లోపం టైం మేనేజ్‌మెంట్ చాలా కీలకమని గుర్తించకపోవడమే. అయినా మెయిన్స్‌లో 915 మార్కులు రావడంతో ఇంటర్వ్యూకు అర్హత సాధించాను.
నక్సలిజం నుంచి హాబీల వరకు:
ఇరవై నిమిషాల ఇంటర్వ్యూలో.. నక్సలిజం ఆవిర్భాం? దాని నేపథ్యం? సమస్యకు పరిష్కారం? ఆంధ్రప్రదేశ్ చేపట్టిన చర్యలు? నక్సలిజం గురించి తెలిసింది చెప్పండి? శాంతి భద్రతలకు నక్సలిజం వల్ల కలిగే విఘాతం ? సమస్యకు పరిష్కారం? మీ హాబీలు? వంటి ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను. ఫలితంగా 300 మార్కులకు 165 మార్కులు పొందాను.
656వ ర్యాంకు సాధించాను.
మొత్తం 1080 మార్కులతో 656వ ర్యాంకు లభించింది. ఈ ర్యాంకుకు ఐఆర్‌ఎస్ లేదా ఐఆర్‌టీఎస్ లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులున్నా ఇంతవరకు రావడం సాధారణమేమీ కాదు. అందుకే వచ్చిన సర్వీస్‌లో చేరి ఆ తర్వాత ఐఏఎస్ కోసం కృషి చేస్తాను.
పేదరికంతో కుంగిపోతే... పైకిరాలేం
గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో సివిల్స్ సాధించాలని కలలు కంటారు. ఇది తప్పుకాదు.0.005 శాతం మాత్రమే సక్సెస్ రేటుండే సివిల్స్ వంటి పోటీ పరీక్షల్లో విజయం అంత సుల భం కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం ప్రిపరేషన్ చేస్తేనే విజయం వరిస్తుంది. అందుకే ఆర్థికంగా కొంచెమైనా భరోసా ఉంటేనే ప్రిపరేషన్ సాగించవచ్చు. పేద విద్యార్థులకు ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ చేయూతనిస్తున్నాయి.
ఎంతసేపు చదివామన్నదికాదు...ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ప్రిపరేషన్ సబ్జెక్టులపై ఫోకస్డ్‌గా ఉండాలి. గంట చదివినా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. చదివింది గంటైనా ఇష్టపడి చదవాలి. ‘నేను రాణించగలను’ అనే దృక్పథమే సగం విజయానికి మూలం. ప్రిలిమ్స్ సిలబస్‌లో మార్పుల నేపథ్యంలో పుస్తకంలో చదివింది మాత్రమే అడగకపోవచ్చు. అందుకే సబ్జెక్టుతోపాటు విశ్లేషణాత్మకంగా, పట్టుసాధించేలా ప్రిపరేషన్ సాగిస్తే విజయం తథ్యం.

No comments:

Post a Comment